ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ ( RSASTF )
రాజంపేట సమీపంలో 8 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఇద్దరు అరెస్టు
రాజంపేట సమీపంలోని ఎస్ఆర్ పాలెం సెక్షన్ లో ఎనిమిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు ముద్దాయిలను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన కార్యాచరణ మేరకు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ పర్యవేక్షణలో డీఎస్పీ జి. బాలిరెడ్డి మార్గనిర్దేశంలో కడప సబ్ కంట్రోల్ లోని ఆర్ఐ ఎం చిరంజీవులకు చెందిన ఆర్ఎస్ఐ పి.నరేష్ టీమ్, ఎఫ్ బీఓ జి.కిరణ్ కుమార్ తో కలసి అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని ఎస్ఆర్ పాలెం సెక్షన్ లో కూంబింగ్ చేపట్టారు. రోళ్లమడుగు బీట్ వద్ద ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తున్న వారిని చుట్టుముట్టారు. వారిలో కొందరు పారిపోగా ఇద్దరు పట్టుబడ్డారు. వారిని తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. వారి నుంచి 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించగా, సిఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.