హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ ప్రాజెక్టు ఓ పెద్ద స్కామ్ అని ఆరోపించారు. మూసీని కాంగ్రెస్ నేతలు ఏటీఎంలా మార్చుకున్నారని విమర్శించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. కాంగ్రెస్ సర్కార్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోపిడీ జరిగితే.. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మూసీ పేరుతో దోచుకోవాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేకపోతున్నారు కానీ.. మూసీ కోసం రూ. 1.50 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తారని నిలదీశారు. మూసీ కోసం అంత అప్పు చేయడం ఎందుకు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.
మూసీ నది సుందరీకరణ కోసం లక్షన్నర కోట్లు అప్పు చేస్తే ఆ భారం ఎవరిపై పడుతుందని కాంగ్రెస్ సర్కార్‌ను బండి సంజయ్ నిలదీశారు. ఇప్పటికే రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వడ్డీల రూపంలో రూ. 10 నెలల్లోనే రూ. 60 వేల కోట్లు కట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ చేతులెత్తేసిందని విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని చెబుతూనే.. కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇళ్ల కూల్చివేతలకు తాము వ్యతిరేకం అని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ తీరుకు నిరసనగా శుక్రవారం నాడు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి.
మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకత్వంలో శుక్రవారం నాడు మహాధర్నా చేపట్టనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడి నాయకత్వంలో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొననున్నట్లు సమాచారం. మూసీ సుందరీకరణ పేరుతో ప్రజల ఇళ్లను కూల్చొద్దని డిమాండ్ చేస్తోంది బీజేపీ. అదే సమయంలో మూసీ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు..