కిరీటి న్యూస్:: హైదరాబాద్: తెలంగాణ కొత్త లోగో (కొత్త రాజముద్ర) దాదాపు ఖరారయ్యిందని గత 24 గంటలుగా హడావుడి జరిగిన సంగతి తెలిసిందే. అదిగో ఇదిగో రిలీజ్ అంటూ కాంగ్రెస్ నేతల మాటలు.. ఇక సోషల్ మీడియాలో అయితే ఇదిగో ఇదే ఫైనల్ అని ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే.. తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా పడింది. తొలుత జూన్- 2 రిలీజ్ చేయాలని భావించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూన్-02న కాకుండా మరో రోజున రిలీజ్ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీనిపై ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే.. తెలంగాణ గీతం మాత్రమే జూన్-02నే విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజల్లో ఓ వర్గం నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది.
కొత్త లోగోలో ఏముంది..?
కాగా.. కొత్త లోగోలో కాకతీయ తోరణం, చార్మినార్ స్థానంలో అమరవీరుల స్థూపానికి రేవంత్ రెడ్డి సర్కార్ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైన మూడు సింహాల లోగోను పైభాగంలో పొందుపరిచినట్లు కొన్ని చిత్రాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ లోగోనే రేవంత్ ప్రభుత్వం దాదాపు ఖరారు చేసిందని వార్తలు గుప్పుమన్నాయి. మొత్తం 40కిపైగా డిజైన్లను కాంగ్రెస్ సర్కార్ పరిశీలించగా.. ఒక్కటి మాత్రం ఫైనల్ చేసిందని టాక్. మరో రెండు రోజుల్లో అవతరణ ఉత్సవాల నేపథ్యంలో రిలీజ్ చేయాలని నిర్ణయించినప్పటికీ వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది.