కరోనా లాక్‌డౌన్, ఆ తర్వాత చిత్ర పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీ అనే మాధ్యమం.. ప్రేక్షకుడు సినిమాను చూసే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కథ, కథనాలు నచ్చకపోతే ఎంతటి సూపర్‌స్టార్ నటించినా ఆ సినిమాను మరో మాట లేకుండా తిరస్కరిస్తున్నారు. దీనికి తోడు పెరిగిన టికెట్ ధరలతో సామాన్యుడికి వినోదం భారంగా మారింది. కుటుంబం మొత్తం థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చులు అవ్వడంతో సగటు మనిషి ఆలోచనలో పడ్డాడు. అందులో సగం ఖర్చుతో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని సంవత్సరమంతా హాయిగా పిల్లాపాపలతో కలిసి సినిమా చూడొచ్చని భావిస్తున్నాడు. దీనికి తోడు తెలుగు సినిమాలు రోటిన్ కమర్షియల్ ఫార్ములాతో వస్తుండటంతో అవి ఎక్కడం లేదు. ఈ పరిణామాలతో ప్రస్తుతం థియేటర్లు నడపటం తలకు మించిన భారంగా మారింది
పెద్ద సినిమాల రిలీజ్‌లు లేకపోవడంతో సింగిల్ స్క్రీన్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లను నిర్వాహకులు మూసివేసిన సంగతి తెలిసిందే. మధ్యలో ఏ నిర్మాతైనా కలగజేసుకుని తమ సినిమా రిలీజ్ చేయాలని కోరితే తప్పించి థియేటర్లు తెరిచే పరిస్ధితి లేదని వారు తేల్చిచెబుతున్నారు. తెలంగాణ థియేటర్ యజమానులు చూపిన బాటలో ఇప్పుడు ఏపీవాళ్లు కూడా ఇదే నిర్ణయం తీసుకునేలా ఉన్నారు. నిన్న జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో తమకు కూడా పర్సంటేజ్ చెల్లించాలని , లేదంటే థియేటర్ల మూసివేత తప్పదని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరే ఇక్కడా పర్సంటేజ్ ఉండాలని .. ఇందుకోసం జూలై – 1 వరకు డెడ్‌లైన్ విధించారు. అయితే కల్కి, పుష్ప-2, గేమ్ ఛేంజర్, భారతీయుడు -2 వంటి సినిమాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు