అమరావతి, కిరీటి న్యూస్:: నిషేధాజ్ఞలు ఉల్లంఘించి రెండు డ్రోన్లు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షో మార్గంలోకి వచ్చాయి. అత్యంత కట్టుదిట్టమైన రక్షణలో ఉండే ప్రధాని పర్యటనలో చోటుచేసుకున్న ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. భద్రతా లోపంపై డీజీపీ, సీఎస్‌లను వివరణ కోరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల విజయవాడలో జరిగిన ప్రధాని మోదీ రోడ్‌షోలో భద్రతాలోపంపై కేంద్ర హోంశాఖ.. రాష్ట్ర పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని భద్రతకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆక్షేపించింది. ఈ నెల 8న తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌లతో కలిసి ప్రధాన మంత్రి విజయవాడలో రోడ్‌షో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ రావడానికి 45 నిమిషాల ముందు రెండు డ్రోన్లు ఎగిరినట్లు కేంద్ర భద్రతా ఏజెన్సీ గుర్తించి హోంశాఖకు నివేదిక ఇచ్చింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర హోంశాఖ.. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలనీ, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
రెడ్ జోన్‌లో ఎగిరిన డ్రోన్లు…:
నగరంలో ప్రధాని రోడ్‌షో సాగే ప్రాంత గగనతలంలో 2 కి.మీ మేర పోలీసులు రెడ్ జోన్‌గా ప్రకటించారు. పర్యటన ముగిసే వరకు ఆకాశంలో డ్రోన్లు, యూఏవీలు (అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్)ఎగరడం నిషేధం. అయితే రెడ్‌జోన్‌ను పోలీసులే ప్రకటించి, వారే ఉల్లంఘించారు. ఈ నెల 8న విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు రోడ్‌షో జరిగింది. దీనికి ప్రధాని రాత్రి 7 గంటలకు వచ్చారు. ఆయన రాకకు 45 నిమిషాల ముందు రోడ్‌షో ప్రారంభం, ముగింపు పాయింట్ వద్ద రెండు డ్రోన్లు ఎగిరాయి. వీటిని ఎన్‌ఎస్‌జీలోని యాంటీ డ్రోన్ బృందం గుర్తించింది. వెంటనే ఈ బృందం.. డ్రోన్ల సిగ్నళ్లను జామ్‌చేసి వాటిని కిందకు దింపింది. ఇవి పోలీసులకు సంబంధించినవిగా గుర్తించారు. ఒక దానిని ఎన్‌ఎస్‌జీ బృందం స్వాధీనం చేసుకుంది. మరొక డ్రోన్ ఆచూకీ లభించలేదు. ప్రధాన మంత్రి రోడ్‌షోలో రాష్ట్ర పోలీసులు.. కేంద్ర భద్రతా ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవడంలో వైఫల్యం కనిపిస్తోంది…