నెల రోజుల్లో రూ.4,650 కోట్లు సీజ్
సర్వేల పేర్లతో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మొబైల్ ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.
చట్టబద్ధమైన సర్వేలు, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే సర్వేల మధ్య ఉండే విభజన రేఖను కొన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చెరిపివేసి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఈసీ పేర్కొంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇటువంటివన్నీ అవినీతికి పాల్పడడంగానే పరిగణిస్తామని చెప్పింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు పంపించిన సూచనల్లో వివరించింది. ఈ తరహా అనైతిక చర్యలపై దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులనూ ఈసీ ఆదేశించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 127ఏ ప్రకారం ఏదైనా ఎన్నికల కరపత్రం లేదా పోస్టర్‌పై ప్రచురణ కర్తల పేర్లు, చిరునామాలు లేకపోయినా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
నెల రోజుల్లో రూ.4,650 కోట్లు సీజ్
సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో నగదు, మద్యం ఏరులైపారుతోంది. ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి భారీగా నగదు జప్తు చేస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి రోజుకు రూ.100 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను జప్తు చేస్తున్నట్లు ఇటీవల భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. 75 ఏళ్ల సార్వత్రిక ఎన్నికల చరిత్రలో జప్తులు ఈసారే రికార్డుస్థాయిలో నగదు జప్తు జరిగిందని ఈసీ పేర్కొంది.