ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్ ‘కల్కి’ (Kalki 2898 AD) నుంచి అమితాబ్ బచ్చన్ లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. ఈరోజు అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో బిగ్ బి లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన ఈ సినిమాలో సాధువుగా కనిపించనున్నారు.
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించాలనేది చాలా మంది నటీనటులకు ఉన్న కోరిక. కానీ ఆ అవకాశం కొంత మందికే దక్కుతుంది. ఇప్పటి వరకు అమితాబ్ పూర్తి స్థాయిలో నటించిన ఏకైక తెలుగు సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాలో నరసింహారెడ్డికి గురువుగా ఆయన కనిపించారు. ఇప్పుడు మళ్లీ ‘కల్కి 2898 AD’ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు, రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి అమితాబ్ నటిస్తుండడం ఇదే తొలిసారి. అందుకే, తన కల నెరవేరిందని అంటున్నారు ప్రభాస్.
ఈరోజు బిగ్ బి అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు. ఆయన నేడు 81వ ఏట అడుగుపెట్టారు. అమితాబ్ బర్త్‌డే సందర్భంగా ‘కల్కి’ మూవీ టీమ్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ద్వారా అమితాబ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ పోస్టర్‌లో అమితాబ్ లుక్ అందరినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే అది సాధువు లుక్. అందులోనూ గుహలో సూర్య కిరణాల వెలుగు మధ్య ఒళ్లంతా, ముఖాన్ని గుడ్డతో కప్పుకుని.. చేతిలో కర్రతో చెయ్యెత్తు మనిషిలా నిలబడి ఉన్నారు బిగ్ బి. ఆ ఆకారం చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది.