✦ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) లాంటి పెద్ద ప్రాజెక్ట్‌తో వెండితెరకు పరిచయం కావడం చాలా ఆనందంగా ఉందని హీరోయిన్ నుపుర్ సనన్ (Nupur Sanon) అంటున్నారు. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో ముచ్చటించారు. స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలే ఈ నుపుర్ సనన్. ఆమె కూడా టాలీవుడ్ నుంచే వెండితెరకు పరిచయం కావడం విశేషం.
✦ మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తోన్న తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). ఈ సినిమా ద్వారా చాలా మంది కొత్తవాళ్లు పరిచయం అవుతున్నారు. దర్శకుడు వంశీ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతుండగా.. హీరోయిన్లు నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, సుదేవ్ నాయర్, అనుక్రీతి వాస్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. అయితే, ఈ సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేస్తున్నారు నుపుర్ సనన్. మిగిలినవాళ్లు ఇప్పటికీ ఇతర భాషల్లో సినిమాలు చేయగా.. నుపుర్‌కు మాత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ తొలి చిత్రం. ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలే ఈ నుపుర్ సనన్. కృతి సనన్ సైతం టాలీవుడ్ నుంచే హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ‘1-నేనొక్కడినే’ కృతి సనన్ తొలి చిత్రం.
✦ ఇదిలా ఉంటే, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. దీంతో చిత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు హీరోయిన్ నుపుర్ సనన్ మీడియాతో ముచ్చటించారు. చిత్ర విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.
✦ ‘టైగర్ నాగేశ్వరరావు’లో నా పాత్ర పేరు సార. తను మార్వాడీ అమ్మాయి.. సోల్‌ఫుల్ క్యారెక్టర్. తను ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసం ఏదైనా చేస్తుంది. ఇది నా మొదటి సినిమా. నా పాత్ర కమర్షియల్‌గా ఉంటూనే నటనకు కూడా అవకాశం ఉంది. మొదటి సినిమాకే ఇలాంటి సవాలుతో కూడుకున్న పాత్ర దొరకడం ఆనందంగా ఉంది.
✦ ఈ సినిమాను నేను అంగీకరించడానికి మొదటి కారణం మాస్ మహారాజా రవితేజ. ఆయన సినిమాలో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. మరో కారణం అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్. ఇప్పటికే ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా సినిమాలు ఇచ్చారు. ఇది నాకు మంచి లాంచింగ్ ప్రాజెక్ట్ అవుతుందని భావించాను. అలాగే దర్శకుడు వంశీ కూడా ఒక కారణం. ఈ పాత్ర కోసం దాదాపు 200 మందిని ఆడిషన్స్ చేశారని తెలిసింది. ఈ పాత్రకు నేను సరిపోతానని ఆయన నమ్మడం నాకు కూడా చాలా నమ్మకాన్ని ఇచ్చింది. వంశీ ఈ కథపై దాదాపు మూడేళ్లు కష్టపడ్డారు. ఏ పాత్ర ఎలా ఉండాలో ఆయనకి చాలా స్పష్టత ఉంది. హీరోయిన్ హెయిర్ బ్యాండ్ ఎలా ఉండాలో కూడా క్లియర్‌గా రాసుకున్నారు. ఆయన చెప్పినట్లుగా నేను నటించాను అంతే.