న్యూ ఢిల్లీ: అక్టోబర్ 04
మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఢిల్లీలోని ఆప్ నేత ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం సోదాలు నిర్వహిస్తోంది.
మనీ లాండరింగ్ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుతో సంబంధమున్న వ్యాపార వేత్త దినేశ్ అరోరాతో సంజయ్‌కి పరిచయాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచి సంజయ్ ఇంట్లో సోదాలు మొదలుపెట్టింది.
ఇదిలా ఉండగా.. సంజయ్ సింగ్ ఈడీ తన ఇంటిపై ఎప్పటికైనా సోదాలు నిర్వహిస్తుందని ముందే గ్రహించారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితమే ఆయన తన ఇంటి ఎదుట ‘ఈడీకి స్వాగతం’ అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
దీనికి సంబంధించిన ఫొటోను ఆప్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేసింది. ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా 2022 జులై 20న కేంద్ర హోంశాఖకు లేఖ రాయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
దీంతో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. తాజాగా ఆప్ రాజ్యసభ సభ్యుడి ఇంట్లో సోదాలు జరుపుతోంది.
దీనిపై సంజయ్ సింగ్ తండ్రి స్పందిస్తూ.. ‘‘ఈడీ తన పని తాను చేస్తోంది. అందుకు మేము సహకరిస్తాం’’ అని మీడియాకు తెలిపారు