అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు..
రాష్ట్రానికి చెందిన వందలాది మంది యువకులు కాంబోడియాలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నకిలీ ఏజెన్సీలు యువతను మోసం చేశాయని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారం ఎన్‌ఐఏ విచారణలో బయటపడిందని పేర్కొన్నారు. బాధిత యువతను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి వీలైనంత త్వరగా బాధితులను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు..