బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో అడ్డంగా దొరికిపోయి , దొరకలేదన్నట్లుగా బుకాయించి విమర్శల పాలయ్యారు సినీ నటి హేమ. వెంట వెంటనే రెండు వీడియోలు రిలీజ్ చేసి తాను స్పాట్‌లోనే లేనని హైదరాబాద్‌లోనే చిల్ అవుతున్నట్లు చెప్పారు. ఇది నిజమేనని జనం నమ్మేలోగా బెంగళూరు పోలీసులు స్పందించారు. హేమ తమ కస్టడీలోనే ఉందని , కుటుంబ సభ్యులకు విషయం చెబుతానంటే ఫోన్ ఇచ్చామని.. దాంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిందని క్లారిటీ ఇచ్చారు. రేవ్ పార్టీకి హాజరైన వారందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా వారిలో 86 మంది మాదక ద్రవ్యాలు సేవించినట్లుగా నిర్ధారణ అయ్యింది. వీరిలో హేమ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెతో పాటు బుల్లితెర నటి అషీరాయ్, మరో నటుడు చిరంజీవి కూడా ఉన్నారు. వీరికి బెంగళూరు రూరల్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
ఇదిలావుండగా .. తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు హేమ అత్యంత తెలివిగా వ్యవహరించారు. దాడి తర్వాత పట్టుబడిన వారి వివరాలను పోలీసులు నమోదు చేసుకుంటూ ఉండగా తన పేరును కృష్ణవేణిగా హేమ చెప్పింది. హేమ అసలు పేరు కృష్ణవేణియే.. ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో అలాగే నమోదై ఉండటంతో దానిని అడ్డం పెట్టుకుని తన స్క్రీన్ నేమ్‌ని దాచే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. అదే పేరుతోనే ఆమె రేవ్ పార్టీకి కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది.