జగన్ సంక్షేమ పథకాలతోనే పేదల జీవితాలలో వెలుగులు నిండాయని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.చిన్నమండెం లోని చాకిబండలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి కుటుంభ సభ్యులు కంచం రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సాయిపీర్, వెంకట్రామిరెడ్డి, ప్రతాప్ రెడ్డి,షకీల్ తదితర నాయకులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ…గురువారం రాయచోటిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తాను 14 ఏళ్ల ముఖ్యమంత్రి గా పని చేసిన సమయాలలో ఫలానా మంచి పనులు చేసాము, ఇప్పుడు ఈ పనులు చేయబోతామని చంద్రబాబు చెప్పకుండా వ్యక్తిగత, పసలేని విమర్శలు,బురద జల్లడం,ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టె ప్రసంగాలు చేయడం సరైంది కాదన్నారు.14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాయచోటి ప్రాంతానికి చెప్పుకునే శాశ్విత అభివృద్ధి పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్, ఉచిత విద్యుత్,108,104 పథకాలతో పాటు ఈప్రాంతంలో వెలిగల్లు, జరికోన, శ్రీనివాసపురం రిజర్వాయర్ లును నిర్మించారన్నారు.జగన్ పాలనలో సచివాలయ వ్యవస్థ,వాలంటరీ వ్యవస్థ,అమ్మఒడి తదితర పథకాలు గుర్తుకు వస్తాయన్నారు.
6 నియోజక వర్గాలుంటే 3 జిల్లా కేంద్రాలు ఎలా చేస్తారు బాబూ….?
అన్నమయ్య జిల్లాలో 6 నియోజక వర్గాలుంటే 3 జిల్లా కేంద్రాలు ఎలా చేస్తారని చంద్రబాబును శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.చంద్రబాబు ఓట్ల కోసం ఏ ప్రాంతానికి వెళ్ళితే ఆ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేస్తానంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టుచున్నారన్నారు.
జగన్ సంక్షేమ పథకాలతో పేదరికం తగ్గింది…
జగన్ సంక్షేమ పథకాలతో పేదరికం తగ్గిందన్నారు.ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా, విలేజ్ క్లినిక్ లకు శాశ్విత భవనాలను నిర్మించడం జరిగిందన్నారు.చంద్రబాబు తన ఎన్నికల ప్రచారాలలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా ,కరోనా విపత్కర పరిస్థితులు ఎదురైనా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని నిలుపుదల చేయకుండా, సంక్షేమ క్యాలెండర్ ను పెట్టి చెప్పినదాని కన్న మిన్నగా, ముందుగా అందించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు.
ఎన్నికల హామీలను నెరవేర్చిన చరిత్ర జగన్ ది…
ఎన్నికల హామీలను నెరవేర్చిన చరిత్ర జగన్ దేనన్నారు.చంద్రబాబు గతఎన్నికల సమయంలో 650 కు పైగా హామీలిచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చక ప్రజలను మోసగించారన్నారు.రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు ను మాపీ చేస్తామని చంద్రబాబు అప్పట్లో హామీలు ఇచ్చి నెరవేర్చక మహిళలు,అన్ని వర్గాల ప్రజలను మోసాగించారన్నారు.ఇప్పుడు ఎన్నికలలో కూడా రూ 3 లక్షల కోట్ల కు పైగా హామీలిచ్చారని, వాటిని ఎలా అమలు చేస్తారో వివరంగా చంద్రబాబు చెప్పడం లేదన్నారు.అసాధ్యమైన హామీలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు.జగన్ ఏదైనా మాట ఇస్తే తప్పక నెరవేరుస్తారన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉందన్నారు.
15 ఏళ్లుగా రాయచోటి కి కాపలాదారుడుగా ఉంటున్నా…
ఏ తప్పూ చేయను.. చేయబోను…తాను రాజకీయాలలో ఏ తప్పూ చేయను, చేయబోనని శ్రీకాంత్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు.భూముల విషయాలలో తాను అన్యాయాలకు పాల్పడినానని టి డి పి చేసిన ఆరోపణలును ఆయన ఖండించారు. భూములకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలలోని నోటీసు బోర్డులలో కూడా వివరాలను ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకున్నామన్నారు.దీంతో టిడిపి వారివే అక్రమాలు బయటపడ్డాయని ఆయన గుర్తు చేశారు.15 ఏళ్లుగా రాయచోటికి కాపలా దారుడుగా వుంటున్నానన్నారు.తనపై బురదజల్లుతున్నారన్నారు.భూ ఆక్రమణలు, అన్యాయాలు, రౌడీయిజాలు, దౌర్జన్యాలు ఎవరు చేస్తారో ప్రజలకు బాగా తెలుసన్నారు.నియోజక వర్గం బాగా అభివృద్ధి చెందింది కాబట్టే శ్రీకాంత్ రెడ్డి ని గెలిపించాలని దేవుడే చంద్రబాబు నోట పలికించారన్నారు.తమపై ఆరోపణలునునిరూపించే ధైర్యం వాళ్లకు లేదన్నారు.మీ చిట్టా విప్పితే తలెత్తు కోలేరన్నారు.రింగ్ రోడ్డును అలైన్ మెంట్ చేయడం జరిగిందన్నారు.జిల్లా కేంద్రాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. చుక్కల భూములు,20 సంవత్సరాల అనుభవం ఉన్న డి కెటి పట్టాలకు రెగ్యులర్ చేయడంవల్ల పేదలకు ఎంతో మేలు జరిగిందన్నారు.సొంత డబ్బులు రూ 30 లక్షలు ఖర్చుపెట్టి ఆనందయ్య మందును ఇంటింటికీ ఆనందయ్య మందును పంపిణీ చేయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.రాష్ట్రంలోనే మొదటి వరుసలోనే రాయచోటి ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామన్నారు.ఒక లక్ష కుటుంబాలకు పైగా గడప గడప కు మన ప్రభుత్వంలో ప్రజలతో మమేకమయ్యామన్నారు.అవినీతి మరక ఏనాడు అంటించుకొనన్నారు.ఏ తప్పూ చేయను, చేసిన రోజున రాజకీయాల నుంచి శాస్వితంగా తప్పుకుంటానన్నారు. మీకు దమ్ముంటే తన తప్పులను నిరూపించాలన్నారు.టి డి పి హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందో చెప్పాలన్నారు.పెన్షన్ లును వాలంటీర్ల ద్వారా ఇళ్ల కే అవ్వతాతలకు అందిస్తుంటే జగన్ కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో తన తొత్తు అయినంటువంటి నిమ్మగడ్డ రమేష్ తో కోర్టులో చంద్రబాబు పిటిషన్ వేయించడం వల్ల వికలాంగులు, అవ్వతాతలు తీవ్రఇబ్బందులకు గురవుచున్నారని, కొంతమంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
రూ 2300 కోట్ల నిధులు వివిధ సంక్షేమ పథకాల ద్వారా రాయచోటి నియోజక వర్గానికి అందడం ఒకరికార్డు…
ఒక రాయచోటి నియోజక వర్గానికే రూ 2300 కోట్ల నిధులు వివిధ సంక్షేమ పథకాల ద్వారా అందడం ఒక రికార్డుగా పేర్కొన్నారు.పేదల సొంతింటి కలను నెరవేర్చారని, నియోజక వర్గంలో 20 వేల పక్కా గృహాలు మంజూరు అయ్యాయన్నారు.93 జగనన్న కాలనీలు నిర్మితమవుచున్నాయన్నారు.
మేము చేసిన అభివృద్ధి పనులను గర్వంగా చెప్పుతాం…
గండికోట నుంచి వెలిగల్లు కు నీళ్లు తీసుకొచ్చే రూ 2200 కోట్ల పథకం పనులు డెబ్భై శాతం మేర పూర్తి అయ్యాయన్నారు. ప్రతి చేరువుకూ కృష్ణా జలాలను పారిస్తామన్నారు. రూ 260 కోట్ల నిధులతో వాటర్ గ్రిడ్ పనులు జరుగుచున్నాయన్నారు.రూ 100 కోట్ల నిదులుతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ పనులకు టెండర్ పూర్తి అయిందన్నారు. రూ 190 కోట్ల నిధులతో పి జి కేంద్రం పనులు ప్రారంభం కానున్నాయన్నారు.వందపడకల ఆసుపత్రి, ఆర్ టి సి బస్ స్టాండ్ విస్తరణ, మున్సిపల్ సభాభవనం, డైట్ మున్సిపల్ సభా భవనం, నగర వనం, శిల్పారామం,క్రికెట్ స్టేడియం ,టి టి డి కల్యాణ మండపం,షాదీ ఖానాకు మరమ్మత్తులు తదితర ఎన్నో అభివృద్ధి పనులను చేసి చూపించామన్నారు.
కరోనా లో టిడిపి నాయకులు ఎక్కడికి పోయారో?
కరోనా లో ప్రజలు ఇబ్బందులు పడితుంటే టి డి పి నాయకులు ఎక్కడికి పోయారని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. తాము కరోనా ఆసుపత్రులకు వెళ్లి రోగులలో మనోధైర్యాన్ని కల్పించి తోడుగా నిలిచామన్నారు.
నేను ఎంఎల్ఏ గా రాకముందు రాయచోటి ఎలా ఉండేది..ఇప్పుడెలా వుందో ప్రజలే ఆలోచించాలి…
నేను ఎంఎల్ఏ గా రాకముందు రాయచోటి ఎలా ఉండేదని,ఇప్పుడెలా వుందో ప్రజలే బేరీజు వేసుకుని ఆలోచించు కోవాలన్నారు. కుటుంభం కంటే నియోజక వర్గ ప్రజల కోసమే అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. మీ బిడ్డ ప్రజల కోసం,నియోజక వర్గ ప్రజల కోసం,శాంతి యుతంగా, అభివృద్ధి పనులు చేస్తూ, ప్రజల జీవన పరిస్థితులు మెరుగు పడేందుకు చిత్తశుద్ధితో అనునిత్యం కృషి చేస్తున్నారన్నారు.
మీ బిడ్డను మరోసారి దీవించండి…
ఈ ప్రాంత రూపురేఖలు మార్చడానికి మీ బిడ్డ ఆయిన నన్ను ఎంఎల్ఏ అభ్యర్థిగాను, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ని ఆదరించి ఆశీర్వదించాలని శ్రీకాంత్ రెడ్డి అభ్యర్థించారు. గతంలో కంటే అత్యధిక మెజార్టీ వస్తుందని శ్రీకాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.