విజయవాడ: సోమవారం విజయవాడలో వైఎస్సార్‌సీపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ సభకు రాష్ట్ర నలమూలల నుంచి పార్టీ శ్రేణులు భారీగా హాజరుకానున్నారు..
మొత్తం 8,222 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్బంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. ఐదు కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉండటం చారిత్రాత్మక అవసరం. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అమలుచేయటం సీఎం జగన్‌కే చెల్లింది. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయ లేనివి సీఎం జగన్ మాత్రమే చేస్తున్నారు. ఆరోగ్య సురక్షలాంటి కార్యక్రమం అమలు చేయాలనే ఆలోచన రావటమే గొప్ప విషయం. పేదవాడికి ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉండాలనేది జగన్ లక్ష్యం. జైల్లో ఉన్న అవినీతిపరులను ప్రజలు పట్టించుకోవటం లేదు. తమకు ఎవరు న్యాయం చేయగలరో వారికే ప్రజలు పట్టం కడతారు అని తెలిపారు..
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలు సీఎం జగన్ తెచ్చారు. గడప గడపకు కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ఇళ్లను నేతలు టచ్ చేశారు. రేపు వైఎస్సార్‌సీపీ సమావేశానికి 8వేలకుపైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో రేపటి సమావేశానికి ప్రాముఖ్యత ఉంది. ఆరోగ్య సురక్ష ద్వారా పేదలందరికీ వైద్యం అందుతోంది..
రేపటి మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్ ప్రసంగిస్తారు. సంక్షేమం, అభివృద్ధి నుండి వైద్యం వరకు ఎన్నో తెచ్చారు. రాష్ట్రం సమగ్రాభివృద్దితో ముందుకు దూసుకుపోతోంది. మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి జగనే సీఎం కావాలి. డబ్బున్న వారికే పరిమితం అనుకున్న కార్పోరేట్ వైద్యం జనం ముంగిటకే వచ్చింది. ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో టీడీపీ ఉంది. చంద్రబాబు అవినీతితో అరెస్టు అయితే, విప్లవకారులను అరెస్టు చేసినట్టు కొన్ని మీడియా సంస్థలు హడావుడి చేస్తున్నాయి. ఇలాంటివన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి అంటూ కామెంట్స్ చేశారు..